అఖిలప్రియ భర్తపై బాబుకు నివేదికలు!

మొన్నటి వరకూ ఆయన ఎవరో తెలియదు. ఎవరో ఒక ప్రముఖుడికి అల్లుడు అట. ఆ ప్రముఖుడి కూతురితో విడాకుల అనంతరం మంత్రి భూమా అఖిలప్రియను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇదంతా వారి వ్యక్తిగత వ్యవహారం. అయితే సదరు మంత్రిగారి భర్తగారు.. ఇప్పుడు పొలిటికల్ హెడ్ లైన్స్ ను ఢీకొడుతున్నాడు. నంద్యాల్లో ఆయనగారి దందా మామూలుగా లేదని సమాచారం.

అందివచ్చిన రాజకీయ అవకాశంతో ఆయన విజృంభిస్తున్నాడని.. వార్తలు వస్తున్నాయి. అఖిలప్రియ భర్త అనే హోదాతో ఆయన చాలా వ్యవహారాలే నడిపిస్తున్నాడని.. బెదిరింపులు, వసూళ్లు.. వంటి విషయాల్లో ఆయనకు తిరుగులేదని నంద్యాల నుంచి సమాచారం అందుతోంది. ఆళ్లగడ్డ, నంద్యాల ఏరియాల వ్యవహారాల్లో మంత్రిగారి భర్తగారే అంతా తాను అవుతున్నాడట.

ఈయన తీరుతో వివిధ వర్గాలు నివ్వెరపోతున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబు వరకూ ఫిర్యాదులు వెళ్లిపోయాయని సమాచారం. మంత్రి భర్త తీరు ఏమాత్రం సరిగాలేదని.. బాబుకు తెలుగుదేశం స్థానిక నేతలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన తీరు వల్ల పార్టీకి మరింత చెడ్డ పేరు వస్తోందని వారు పేర్కొన్నట్టుగా సమాచారం.

ఈ ఫిర్యాదు విషయాన్ని నంద్యాల టీడీపీ వర్గాలే మీడియాకు చేరవేస్తున్నాయి. అయితే భర్తను వచ్చేసారి ఎంపీగా పోటీ చేయించాలని అఖిలప్రియ భావిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబుకు ఆమె ప్రతిపాదన పంపినట్టుగా తెలుస్తోంది. అయితే అందుకు చంద్రబాబు ఒప్పుకునే అవకాశాలు లేవని సమాచారం.

అందుకే అఖిలప్రియ ఫ్యామిలీ జనసేనలో కూడా కర్చిఫ్ వేసేసిందట. భర్త ప్రోద్బలంతో అఖిలప్రియ జనసేనలోకి చేరడం ఖాయమని అంటున్నారు. అయితే ఇటీవలే అఖిల ఆ ప్రచారాన్ని ఖండించింది. ఈ ఖండనలు అన్నీ పైపైకే అని.. లోలోపల అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయనేది నంద్యాల టాక్!

Loading…