కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కడప ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 27న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. బుధవారం సీఎంను ఆయన నివాసంలో కలిసి రమేశ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం సహకరించకపోయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఏపీఎండీసీతో కలిసి ముందుకు వెళ్తున్నామని, ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపితే నిబంధనల ప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై జరుగుతున్న ఈడీ దాడులు కక్షపూరితమైనవని పేర్కొన్నారు. ఈ విషయంలో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని, ఐటీ దాడులపై న్యాయపోరాటం చేస్తామని రమేశ్ పేర్కొన్నారు.

Loading…