కరణ్ జోహార్ ఆఫీస్‌కు విజయ్ దేవరకొండ, జాన్వీతో చిత్రానికి సై!

హీరో విజయ్ దేవరకొండ, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. సినిమా గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే ఈ జంట టాలీవుడ్, బాలీవుడ్‌ వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ కపూర్ కూడా విజయ్ దేవరకొండపై తనకు ఉన్న అభిమానాన్ని చాటింది. అతను మంచి ప్రతిభ గల నటుడని కొనియాడింది.

ఈ నేపథ్యంలో జాన్వీ, విజయ్‌ల చిత్రం దాదాపు ఖరారైనట్లేనని వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో కలిసి నటించాలని ఉందని జాన్వీ చెప్పిన మాటలపై విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు కూడా జాన్వీ, కరణ్ జోహార్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పాడు. అంతేకాదు, కరణ్ జోహార్‌ను కలిసేందుకు ఓసారి తాను ముంబయిలోని ఆయన ఆఫీసుకు వెళ్లానని, ఆయన ఆఫీసులో కూర్చున్నప్పుడు నేనేంటి ఇక్కడ ఆఫీసులో అని అనిపించిందని విజయ్ అన్నాడు. విజయ్ మాటలు చూస్తుంటే జాన్వీతో సినిమా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీదేవి మరణం తర్వాత కరణ్ జోహార్.. జాన్వీకి గాడ్‌ఫాదర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ ఇండస్ట్రీలో ఆమెను మంచి స్థానంలో నిలబెట్టే బాధ్యత తీసుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీదేవి కోరిక మేరకు జాన్వీ దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘ధడక్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ.. తెలుగు సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె విజయ్ దేవరకొండ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

‘బాహుబలి’ సినిమా నిర్మాణ బాధ్యతల్లో భాగంగా కరణ్ జోహార్‌కు టాలీవుడ్‌తో సత్సంబంధాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద దర్శకుడి నుంచే ఈ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ‘టాక్సీవాలా’ విజయంతో సంబరాలు చేసుకుంటున్న విజయ్.. ‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగులో బిజీగా ఉన్నాడు. భరత్ కమ్మా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మీక మందాన హీరోయిన్‌గా నటిస్తోంది.