కేంద్రంలో కింగ్ మేకర్‌‌గా జగన్.. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎవరికి దక్కబోతుంది? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కబోతున్నాయి? ప్రతి తెలుగువాడికి ఆసక్తికరమైన ప్రశ్న ఇది. అసెంబ్లీ స్థానాలతోపాటు ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లోస్తాయి? అనే అంశం కూడా ఆసక్తి కలిగిస్తోంది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి.. టైమ్స్ నౌ-వీఎంఆర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఉంటుందని ఈ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంటరీ స్థానాలకు గానూ.. ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీ 23 సీట్లను గెలుచుకుంటుందని టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. అధికార టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరిచే ఛాన్స్ లేదని తెలిపింది. 2014లో టీడీపీ 15 స్థానాలను సొంతం చేసుకోగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను, బీజేపీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత జగన్ కేంద్రంలో చక్రం తిప్పుతారని ఈ ఒపీనియన్ పోల్ అభిప్రాయపడింది.

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుచుకోవాలని చూస్తుండగా.. ఆ పార్టీకి 10 స్థానాలు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్‌లో అభిప్రాయపడింది. కాంగ్రెస్ 5, బీజేపీ 1, ఇతరులు ఒక స్థానం చొప్పున గెలవొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు 12 మంది ఎంపీలుండగా.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపీలున్నారు.

Loading…