కోడి కత్తి వ్యవహారంలో ఢిల్లీలో నానా హడావుడి చేశారు: వైసీపీపై చంద్రబాబు మండిపాటు

కోడి కత్తి వ్యవహారంలో ఢిల్లీలో నానా హడావుడి చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘తిత్లీ’ విషయంలో స్పందించని కేంద్రం, కోడికత్తి వ్యవహారంలో మాత్రం స్పందించడం హాస్యాస్పదమని అన్నారు.

కేంద్రానికి ఏపీ కూడా పన్నులు చెల్లిస్తోందని, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన అవసరం
కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు నీచరాజకీయాలకు పాల్పడ్డారని, వారి ఆటలు తన వద్ద సాగవని హెచ్చరించారు. తిత్లీ బాధితులకు సాయం విషయమై ఢిల్లీ నేతలను వారు ఒక్క మాట కూడా అడగలేదని విమర్శించారు.

పక్క జిల్లాలో ఉండి కూడా ‘తిత్లీ’ బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించక పోగా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయనపై మండిపడ్డారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా చంద్రబాబు విమర్శలు చేశారు. ఉద్దానంపై ప్రేమ ఉందని చెప్పే పవన్, ఈ విషయమై కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కేంద్రంపైనా ఆయన విరుచుకుపడ్డారు. కేంద్రానికి మానవత్వం లేదని, తుపాన్ బాధితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని అన్నారు. గుంటూరులో బీజేపీ కార్యాలయం శంకుస్థాపన చేసేందుకు మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సమయం ఉందిగాని, తిత్లీ బాధితులను పరామర్శించేందుకు మాత్రం ఆయనకు తీరిక లేదంటూ విమర్శలు గుప్పించారు.

కేంద్ర ప్రభుత్వం తీరును దేశ వ్యాప్తంగా తిరిగి ఎండగడతామని, కేంద్ర పెద్దలు దేశాన్ని భ్రష్టుపట్టించారని నిప్పులు చెరిగారు. దేశంలో రాజకీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తామని, బీజేపీ అరాచకపాలనను అంతమొందించేందుకే కాంగ్రెస్ పార్టీ సహకారం కోరామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హక్కుల కోసం పోరాటం ఆగదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.

Loading…