జగన్‌కు మంత్రుల లేఖలు-సెల్ప్‌గోల్‌ అవుతుందా?

ఈ మధ్యకాలంలో తెలుగుదేశం నేతలు, ముఖ్యంగా ఏపీ మంత్రులు రాస్తున్న లేఖలు గమనిస్తున్నారా? వారు ఎవరికి లేఖ రాస్తున్నారో తెలుసా? ప్రతిపక్ష నేత జగన్‌కు.. ఏమని రాస్తున్నారు.. ఆ సమస్య పరిష్కారం కాలేదు.. ఈ సమస్య ఇలా అయింది.. తెలంగాణ, ఏపీ మధ్య ఈ తగాదాలు వచ్చాయి.. ఇలా రాస్తున్నారంటే అర్థం ఏమిటంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిపోయారని, ఆయనను విమర్శించడానికి ఈ సమస్యలతో లేఖలు రాస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా ఆ ఉత్తరాలు ఉంటున్నాయి. తెలుగుదేశం నేతల తెలివితక్కువ తనానికి అది ఒక నిదర్శనమనుకోవాలి. లేకుంటే అతి తెలివి అయినా అయి ఉండాలి.

గతంలో ఎన్నడూ అధికార పార్టీలో ఉన్నవారు ముఖ్యమంత్రి కాని, మంత్రులు కాని ప్రతిపక్ష నేతకు ఇలా లేఖలు రాయలేదు. మహా అయితే తాము ఈ పనులు చేశాం.. ఈ పనులు ఇంకా ఉన్నాయి.. ఈ సమస్యలు ఇలా ఉన్నాయి.. అని ప్రజలకు బహిరంగ లేఖలు రాసేవారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయా అంశాలపై లేఖలు రాస్తుంటారు. కాని ఏపీలో రివర్స్‌ నడుస్తోంది. తద్వారా ఏపీ ప్రభుత్వం విఫలం అయిందని స్వయంగా మంత్రులే ఒప్పుకుంటున్నారన్నమాట. ఉదాహరణకు తాజాగా మంత్రి కొల్లు.రవీంద్ర రాసిన లేఖనే తీసుకుందాం.. అందులో ఆయన ఏమిరాశారు.

తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న విభజన సమస్యలు తీరకపోవడానికి కారణం కేసీఆర్‌ అని ఆరోపించారు. అంతవరకు అభ్యంతరం లేదనుకుందాం. తొమ్మిది, పది షెడ్యూల్‌ సంస్థల ఆస్తుల విభజన తదితర అంశాలలో ఏపీకి అన్యాయం జరుగుతోంది.. దానికి కారణం టీఆర్‌ఎస్‌ అని వారు చెబుతున్నారు. ఏపీ విద్యార్థులకు నష్టం జరిగింది.. ఇలా పలు అంశాలు రాశారు. మరి ఇంతకాలం అధికారంలో ఉన్నది ఎవరు? గవర్నర్‌ వద్దకు రెండు రాష్ట్రాల తరపున మంత్రుల కమిటీలు వెళ్లినప్పుడు ఎందుకు వారు నోరు విప్పలేదు?

సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు ఆద్వర్యంలోనే గవర్నర్‌ వద్ద భేటీ అయ్యారు కదా.. అంతదాకా ఎందుకు అనంతపురంలో మంత్రి పరిటాల సునీత కుమారుడు వివాహానికి కేసీఆర్‌ వెళ్లినప్పుడు ఎక్కడలేని హడావుడి చేసింది తెలుగుదేశం నేతలే కదా.. అప్పుడు ఈ విభజన సమస్యలు కాని, హైదరాబాద్‌లో యువతకు అన్యాయం జరుగుతున్న విషయం కాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రులకు గుర్తులేదా? ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలను ఏపీలో ఉన్న టీడీపీ నేతలు బంధువులైనా కలవవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడు అనంతపురం వద్ద వేచి ఉండి మరీ కేసీఆర్‌తో ముచ్చట్లు చేశారే.

హైదరాబాద్‌లో యువతకు అన్యాయం జరుగుతోందన్న విషయం చంద్రబాబుకు తెలిసినా అలా ఎందుకు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. రాజధాని శంకుస్థాపనకు స్యయంగా కేసీఆర్‌ను ఆహ్వానించారే. ఆంధ్రాధ్రోహి అయితే రాజధాని శంకుస్థాపన శిలాఫలకంపై కేసీఆర్‌ పేరు కూడా ఎందుకు చెక్కించారు? అసలు ఆంధ్రులకు ద్రోహం చేసింది ఎవరు? కేసీఆరా? చంద్రబాబు నాయుడా? హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల వరకు అవకాశం ఉంది కదా.. ఆ ఉద్దేశంతోనే కదా.. వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్‌ సెక్రటేరియట్‌, సీఎం ఛాంబర్‌, చంద్రబాబు ఇళ్లు, లేక్‌వ్యూ అతిధి గృ హాలు వంటివాటిని రిపేరు చేయించారే.

కాని ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాజీఫార్మూలా కింద కేసీఆర్‌ చెప్పినట్లు హైదరాబాద్‌ వదలి వెళ్లిపోయి ఆంధ్రుల పరువుతీసింది చంద్రబాబే కదా?. మరి కేసీఆర్‌ను తప్పు పడతారేమిటి? ఆ తర్వాత కేసీఆర్‌ పిలవగానే యాగానికి వెళ్లి వచ్చారే? రాజధానిలో కేసీఆర్‌కు మంచి విందు ఇవ్వడానికి చూపిన శ్రద్ధ విభజన సమస్యలపై ఎందుకు చర్చించలేదు? అసలు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలని ఎందరు కోరినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. నాలుగున్నరేళ్లు చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నారు కదా.. ఓటుకు నోటు కేసు రాజీకోసం చేసిన ప్రయత్నం విభజన సమస్యలపై కేంద్రం వద్ద ఎంతవరకు మాట్లాడారు.

అసలు కేంద్రంతో ఏమిపని. నలభైఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు స్వయంగా చొరవ తీసుకుని కేసీఆర్‌తో ఎందుకు మాట్లాడలేదు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం హరికృష్ణ శవం వద్ద కేటీఆర్‌తో మాట్లాడడానికి చూపిన శ్రద్థ విభజన సమస్యలపై చంద్రబాబు పెట్టి ఉండవచ్చు కదా.. అది చేయకపోగా తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు జై తెలంగాణ అంటూ తిరిగారు కాని, ఎక్కడైనా జై ఆంధ్రప్రదేశ్‌ అన్న నినాదం ఇవ్వలేదే.. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డ్డుపడలేదని చంద్రబాబు కాని, మంత్రి ఉమా కాని పదే, పదే ఎన్నికల ప్రచారంలో చెప్పారే.

ఇప్పుడేమో జగన్‌ టీఆర్‌ఎస్‌ వారితో ఫెడరల్‌ ప్రంట్‌ గురించి మాట్లాడతారా? ఇంకేముంది ఆంధ్రాద్రోహం అని ప్రచారం చేస్తారా? ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా? మీరు కేసీఆర్‌తో, మోడీతో కలిసి ఉన్నప్పుడు కేసీఆర్‌ అడుగులకు మడుగులొత్తుతూ ఓటుకు నోటు కేసు తర్వాత ఒక్కమాట అనుకుండా ఉన్న సమయంలో విభజన సమస్యలను పరిష్కరించుకుంటే జగన్‌ ఏమైనా అడ్డంపడ్డారా? అసలు హైదరాబాద్‌పై హక్కు వదలుకుని ఆంధ్రులకు అవమానం కలిగేలా చేసిన చంద్రబాబు ఆంధ్రా ద్రోహి అవుతారు కాని.. జగన్‌కు ఏమి సంబంధం.

కాకపోతే ఓటమి భయంతో కేసీఆర్‌ను అడ్డంపెట్టుకుని జగన్‌పై విద్వేషదాడి నీచంగా చేయాలన్న తెలుగుదేశం వ్యూహం విఫలం అవుతుందని మాత్రం చెప్పక తప్పదు. ఏతావాతా చెప్పేదేమిటంటే మంత్రులు కొల్లు రవీంద్ర అయినా, కళా వెంకటరావు, అమరనాథరెడ్డి అయినా రాసిన లేఖల ప్రకారం జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నట్లు భావించాలి. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు విఫలం అయ్యారని ఆయన మంత్రులే చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. నిజాయితీ లేకుండా ఎప్పుడూ ఎదుటివారిపై ఏదో ఒక బురద జల్లాలన్న తాపత్రయంలో ఇలాగే సెల్ప్‌గోల్‌ వేసుకుంటారనిపిస్తుంది.

Loading…