జగన్, పవన్ సిగ్గు లేకుండా అమ్ముడుపోయారు.. మోదీకి చెక్ పెట్టే సత్తా చంద్రబాబుకే ఉంది!: ఎంపీ కొనకళ్ల

ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా ఏపీ సీఎం చంద్రబాబుకే ఉందని టీడీపీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఏకీకరణకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ఈ రోజు జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో కొనకళ్ల పాల్గొన్నారు.

అనంతరం నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ తీవ్ర అన్యాయం చేశారని కొనకళ్ల ఆరోపించారు. అయినా సిగ్గులేకుండా ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ లు మోదీకి అమ్ముడుపోయారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని దుయ్యబట్టారు.

బీజేపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు జాతీయస్థాయిలో నేతలను ఏకం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తో జట్టుకట్టినట్లు పేర్కొన్నారు.

Loading…