టీడీపీతో పొత్తు.. మాజీ సీఎం కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటున్నారు కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో మరో 25 ఏళ్లు ముందుకు వెళుతుందన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడిన కిరణ్.. తాజా రాజకీయాలతో పాటూ టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపై స్పందించారు.

50 ఏళ్లుగా జరుగుతున్న ఎన్నికల వేరు.. రాబోయే ఎన్నికలు వేరు అంటున్నారు కిరణ్‌కుమార్ రెడ్డి. పార్లమెంట్‌ ఎన్నికల్లో వేయబోయే ఓటు జీవితాలను మారుస్తుందని వ్యాఖ్యానించారు. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని సక్రమంగా వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తుపై కిరణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీలు కలిసి పనిచేయడంపై స్పష్టత లేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ తన కర్తవ్యం నిర్వర్తించడం లేదని.. కేవలం నడవడానికే జగన్‌ సమయం కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ ఎన్నికలు దాటితే ప్రత్యేక హోదా పాతబడిపోతుందని.. రాహుల్‌ని ప్రధాని చేస్తే ఏపీ 25 ఏళ్లు ముందుకెళ్తుందన్నారు కిరణ్. కేంద్రం నుంచి పనులు చేయించగలిగే వారికే ఏపీలో ఓటు వేయాలని.. ఏపీకి విభజన హామీలు అమలయ్యే సమయంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ ప్రధానిగా ఉండాలన్నారు.

Loading…