టీడీపీతో పొత్తు లేదు.. కాంగ్రెస్ ను వీడటానికి సై!

తెలుగుదేశం పార్టీతో పొత్తు మీద చాలామంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకుని ఉన్నారని మొదటి నుంచి చెప్పడం జరుగుతోంది. టీడీపీతో పొత్తు ఉండాలని.. ఏపీ కాంగ్రెస్ లీడర్లు రాహుల్ కు నివేదికలు ఇచ్చారని కూడా పాఠకులకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన సమీకరణాల ప్రకారం.. కాంగ్రెస్ తో పొత్తుకు నో అనిచెప్పాడు. తెలంగాణలో కాంగ్రెస్ ను దెబ్బతీసిన బాబు.. ఏపీలో మాత్రం ఆ దెబ్బ తనకు పడకూడదని కాంగ్రెస్ కు హ్యాండిచ్చాడు. ఏపీ కాంగ్రెస్ లీడర్లు రాహుల్ కు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది.

తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంటుంది… ఆ పొత్తుతో తాము పోటీచేస్తే.. తమ సీట్లలో పోరాడొచ్చు అని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు అనుకున్నారు. అయితే పొత్తులేదని తేలిపోయాకా.. ఇప్పుడు వీళ్లు పక్కచూపులు చూస్తున్నారు. రానున్న పక్షం రోజుల్లోనే ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలావరకూ ఖాళీ అయిపోతుందని సమాచారం. ముందుగా టీడీపీతో పొత్తు విషయంలో బాగా ఆశలు పెట్టుకున్న కర్నూలు మాజీ ఎంపీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశంలోకే జంప్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది.

కోట్లను చేర్చుకోవడానికి టీడీపీ చాన్నాళ్లుగా తహతహలాడుతూ వస్తోంది. అయితే కాంగ్రెస్ లో ఉన్నత పదవులు పొందిన కోట్ల కుటుంబం పార్టీ మారితే పరువు పోతుందన్నట్టుగా ఇన్నాళ్లూ కామ్ గా ఉండింది. చివరి ఆశగా వీరు పొత్తు ఉంటుంది, కర్నూలు ఎంపీ టికెట్ దక్కుతుందని అని ఆశించారు. చివరకు పొత్తు ఆశలు లేకుండా పోవడంతో.. కోట్ల కుటుంబం తెలుగుదేశంలోకి చేరనుందనే మాట వినిపిస్తోంది.

టీడీపీకి కూడా కర్నూలు జిల్లాలో నేతల అవసరం చాలానే ఉంది. అందుకే కోట్ల వస్తే ఆయనకు కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంత బతుకు బతికి కోట్ల ఇలా తెలుగుదేశం పార్టీలో చేరడం మాత్రం ఆయన అనుచవర్గాన్ని విస్మయానికి గురిచేసే అంశంగా అవుతోంది.

Loading…