టీడీపీ నేతలు : ‘ఆలీబాబా-40 దొంగలు’

ఆంధ్రాలో టీడీపీ నేతల అవినీతిని చూసి ప్రజలు విస్తుపోతున్నారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఐటీ దాడుల్లో టీడీపీ నేతల అవినీతి బయటపడుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సిగ్గులేకుండా వెనకేసుకుని వస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరీ, సీఎం రమేశ్ లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తాను ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు జీవీఎల్ చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనాకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేదని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. ఆంధ్రాలో తన బినామీలను కాపాడుకునే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ‘ఆలీబాబా 40 దొంగల్లా’ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని టీడీపీ నేతలు దోచేస్తుంటే బీజేపీ ప్రశ్నించకుండా ఉండాలా? అని ఘాటుగా స్పందించారు. ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారనీ, కానీ నేడు అదే పార్టీని చంద్రబాబు రాహుల్‌ గాంధీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు.

Loading…