‘దేశం’ దిశగా జేడీ అడుగులు?

జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ రంగప్రవేశం చేసినపుడే గుసగుసలు వినిపించాయి. పవన్ కళ్యాణ్ కు కమ్యూనిటీ పరంగా చెక్ చెప్పడానికే జేడీని రంగంలోకి దింపుతున్నారన్న వదంతులు వినిపించాయి. కానీ ఆయన తాను వేరే పార్టీ పెడతా అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారి అన్నీ ఉడిగిపోయిన పాత పార్టీ ఒకటి తెరమీదకు వచ్చింది. అదే లోక్ సత్తా. లోక్ సత్తా తనకు తానే తనను టేకోవర్ చేయమంటూ జేడీ లక్ష్మీనారాయణకు ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

లోక్ సత్తా అంటే ఎన్ని ఆశయాలు వెల్లడించినా, ఓ సామాజిక వర్గ బంధాలు వున్న పార్టీ అని కనిపించని ముద్ర వుంది. పైగా దానికి మీడియా టైకూన్ పెద్దాయిన ఆశీస్సులు వున్నాయని, అలాగే సినిమా రంగంలోని ఓ సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆరంభంలో భారీగా విరాళాలు ఇచ్చారని కూడా గుసగుసలు వున్నాయి.

గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో లోక్ సత్తా అధినేత ఏ విధంగా పర్యటించారో? ఏ విధంగా ప్రసంగాలు చేసారో? ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించడంలో తన వంతు పాత్రను పోషించారో? అందరికీ తెలిసిందే. అందువల్ల లోక్ సత్తా వైఖరి అనుమానాస్పదమే కానీ, ఇంకోటి కాదు.

అలాంటి లోక్ సత్తా ఉన్నట్లుండి తమ పార్టీని టేకోవర్ చేసుకుని, నాయకత్వ పగ్గాలు తీసుకోమని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పార్టీ నాయకత్వ పగ్గాలు జేడీకి అప్పగిస్తారట. పై నుంచి సలహాలు సూచనలు జేడీ అందిస్తారట.

అంటే జనసత్తాకి ఇప్పటి వున్న సామాజిక బంధాలకు తోడుగా మరో బలమైన సామాజిక బంధం కలుపుకుని, దానికి మేధావులు, బ్యూరోక్రాట్లు, అంటూ చక్కెరపూత పూసే ప్రయత్నం జరుగుతోందన్నమాట. దానికి మన బాబు గారి అను’కుల’ మీడియా దన్ను ఎలాగూ వుంటుంది.

ఏమైనా రాజకీయ ఎత్తుగడల్లో బాబుగారి తరువాతే ఎవరైనా? అందులో డౌటే లేదు.

Loading…