పవన్ కల్యాణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్

చేతిలో ఆయుధం ఉన్నప్పటికీ సినిమాల్లో విలన్ ని హీరో నేరుగా చంపడు. ఆ ఆయుధం పక్కనపడేసి.. రారా తేల్చుకుందాం అంటూ సవాల్ విసురుతాడు. చివరకు వాడ్ని పడగొడతాడు. ఆ మాత్రం డ్రామా ఉంటేనే ప్రేక్షకులకు ఆసక్తి. సినిమాల్లో నుంచి వచ్చాడు కదా ఇలాంటి మెలోడ్రామాలు పండించడంలో పవన్ కల్యాణ్ దిట్ట. నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోడానికి బదులు, వారందర్నీ తనతో పాటు రైలులోనే, బస్సులోనో, కారులోనో వెంట తిప్పుకుంటూ వారి సమస్యలు తీరిగ్గా వింటుంటారు.

ఆమధ్య రైలు యాత్రలో భాగంగా బెజవాడ నుంచి తుని వరకు రైలులో ప్రయాణిస్తూ పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవన్. రైల్లోనే ముఖాముఖి, సమావేశాలు అన్నీ ఏర్పాటుచేశారు. చివరకు వారి కష్టాలు తెలుసుకోగలిగారు. ఇప్పుడు కూడా అదే సీన్, కానీ ఈ సీన్ పట్టాలపై నుంచి రోడ్డుపైకి మారింది. రైలు జర్నీ కాస్తా బస్సు జర్నీ అయింది.

రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తూ గిరిజనుల కష్టాలు తెలుసుకోబోతున్నారు జనసేనాని. మధ్యాహ్నం 1 గంటకు ప్రయాణం ప్రారంభించి బస్సులో వెళ్తూ గిరిజనుల సమస్యలపై ఓ అవగాహనకు వస్తారట పవన్. ఆ తర్వాత సాయంత్రం రంపచోడవరంలో బహిరంగ సభపెట్టి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తారు. సింపుల్ గా ఇదీ ఈరోజు జరగబోతున్న షెడ్యూల్.

ఇంతకీ ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాన్సెప్ట్ ఏంటో పవన్ కల్యాణ్ కే తెలియాలి. పబ్లిసిటీ కావాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి కదా. అందుకే జనసేనాని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. గతంలో రైతుల కష్టాలు, చేనేతల కష్టాలు, అసంఘటిత రంగంలోని కార్మికుల కష్టాలను నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకున్న పవన్ కల్యాణ్, ఇప్పుడు ట్రెండ్ మార్చారు.

ఏ కార్యక్రమం చేసినా పబ్లిసిటీ బాగుండాలి, ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకే అందరు రాజకీయ నాయకుల్లా కాకుండా ప్రయాణాల్లో సమస్యలు వింటూ వాటిపై స్టడీ చేస్తున్నారు. మొన్న రైలు, ఈరోజు బస్సు.. రాబోయే రోజుల్లో జనసేనాని ఇంకెన్ని వాహనాలు మారుస్తారో చూడాలి.

ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్, ప్రజలకు ఎంతవరకు ఉపయోగమో తెలియదు కానీ, ప్రయాణంలో ప్రజా సమస్యలు అనే కాన్సెప్ట్ మాత్రం పవన్ కు బాగానే పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది.

Loading…