పవన్, జగన్ లకు లాలూచీ రాజకీయాలు అవసరం.. నాకు కాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ లకు లాలూచీ రాజకీయాలు అవసరమని… తనకు అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల అండతో కొండనైనా ఢీకొంటామని చెప్పారు. తమకు అధికారం ముఖ్యంకాదని, ఆత్మగౌరవం ముఖ్యమని తెలిపారు. శ్రీకాకుళంలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో ఆయన ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు కాంగ్రెస్ తో పోరాడామని, ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవడం కోసం కలసి పని చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని… కానీ, కేంద్రం నమ్మించి, మోసం చేసిందని ఈ సందర్భంగా చంద్రబాబు మండిపడ్డారు. మద్రాస్ నుంచి హైదరాబాదుకు వచ్చి అద్భుతంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ఆదాయం లేదని… ప్రత్యేక హోదా తప్ప మరో మార్గం లేదని అన్నారు. ఏపీని ఆదుకుంటామని చెప్పిన బీజేపీ… మాట తప్పిందని విమర్శించారు. తాను చేస్తున్న ధర్మ పోరాట దీక్ష భవిష్యత్తు తరాల కోసమేనని చెప్పారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా పోరాడతామని చంద్రబాబు తెలిపారు.

Loading…