ప్రజలు బీజేపీ నాయకుల్ని చొక్కా పట్టుకుని ప్రశ్నించే సమయం ఆసన్నమైంది

ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలతో పాటు సమాఖ్య వ్యవస్థను కేంద్రం బ్రష్టుపటిస్తున్న తీరుపై రాష్ట్ర బీజేపీ నాయకులని ప్రజలు చొక్కా పట్టుకొని అడిగే సమయం ఆసన్నమైందని రాయపాటి రంగారావు పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏ మొఖం పెట్టుకొని బీజేపీ నాయకులు ఇంటింటికి భాజపా కార్యక్రమాన్ని చేపడుతున్నారని, అసలు కేంద్రం నుంచి ఏం సాధించుకువచ్చారని ఈ కార్యక్రమం చేస్తున్నారని బీజేపీ నాయకుల్ని రంగారావు ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కనీసం గట్టెక్కించలేని రాష్ట్ర బీజేపీ నాయకులు.. కేంద్రాన్ని ఏనాడైనా ప్రశ్నించారా? మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలను అవమాన పరిచినట్లుగా ఉందంటూ రంగారావు బీజేపీ నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు.

2019 ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని బీజేపీ నాయకులు ప్రజల వద్దకు వెళితే అవమానమే మిగులుతుందని జోశ్యం చెప్పారు.తెలుగు ప్రజలు రాష్ట్ర బీజేపీ నాయకుల్ని తరిమి కొట్టే సమయం దగ్గర్లోనే ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తుంటే మద్ధతు కూడా తెలపకుండా ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు, విమర్శలను ప్రజలు ఎప్పటికి మర్చిపోరని రంగారావు వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజనాలను కాపాడలేని బీజేపీ, వైసీపీ పార్టీలు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ప్రజలు క్షమించరని, రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడే ముందు దేశ వ్యాప్తంగా బీజేపీ చేస్తున్న అవినీతి గురించి ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడటం లేదు? కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను అస్థవ్యస్థం చేస్తున్నా రాష్ట్ర బీజేపీ నాయకులకు కనపడదా అంటూ రాయపాటి రంగారావు రాష్ట్ర బీజేపీ నాయకులను తనదయిన శైలిలో ప్రశ్నించారు.

దేశ వ్యాప్తంగా అవినీతిని తగ్గించిన రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో ఉందన్న సంగతి బీజేపీ మరియు ప్రతిపక్ష నాయకులకు కనపడలేకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్‌రెడ్డికి అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత లేదని , ఆయన నాయకుడిగా పనికి రారని జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ విమర్శిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా బోడి గుండుకు మోకాళ్లుకు ముడిపెట్టినట్లుగా వైసీపీ నాయకులు మాట్లాడటం హేయకరమన్నారు. అవినీతి పార్టీ నీతి వంతమైన వ్యాఖ్యలు చేస్తుంటే గురువింద సామెతను గుర్తు చేస్తున్నట్లుగా ఉందని ప్రజలు భావిస్తున్నారని, కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే వైసీపీ, జనసేన, రాష్ట్ర బీజేపీ నాయకులు కనీసం నోరువిప్పే ధైర్యం చేయలేకపోవడం సిగ్గుచేటని, కేసుల మాఫీ కోసం ఒకరు, రాజకీయ లబ్దికోసం మరొకరు మోదీ, అమిత్‌షాలకు పాదాక్రాంతం అయ్యారంటూ బీజేపీతో కలిసి పవన్, జగన్ చేస్తున్న రాజకీయాలను దుయ్యబట్టారు.

Loading…