‘బుక్ మై షో’ లో 10 లక్షల టికెట్లు తెగాయ్

‘బాహుబలి’తో పోల్చి ‘2.0’కి అంత క్రేజ్ లేదని అంటున్నారు కానీ.. దీనికి హైప్ అంత తక్కువేమీ లేదని స్పష్టమవుతోంది. విడుదలకు ముందే ‘బుక్ మై షో’లో ఈ చిత్రం రికార్డు నెలకొల్పింది. ఈ వెబ్ సైట్ ద్వారా అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైన సినిమాగా ‘2.0’ రికార్డులకెక్కింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ‘2.0’ ఈ మైలురాయిని టచ్ చేసింది. బుధవారం నాటికే ‘బుక్ మై షో’లో ‘2.0’కు మిలియన్ టికెట్లకు పైగా అమ్ముడయ్యాయి.

‘బాహుబలి: ది కంక్లూజన్’కు సైతం ఇంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడవలేదని అంటున్నారు. ఇది ఎంత వరకు క్రెడిబుల్ న్యూస్ అన్నది తెలియడం లేదు కానీ.. ‘బాహుబలి’తో పోల్చకుండా మామూలుగా చూస్తే మాత్రం కేవలం ‘బుక్ మై షో’లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే 10 లక్షలకు పైగా టికెట్లు తెగడమంటే మామూలు విషయం కాదు. తెలుగులో చివరగా వచ్చిన పెద్ద సినిమా ‘అరవింద సమేత’ రిలీజైన ఐదారు రోజులకు ‘బుక్ మై షో’లో 10 లక్షల టికెట్ల మైలురాయిని అందుకుంది.

ఐతే దాంతో పోలిస్తే ‘2.0’ భారీగా రిలీజవుతోంది. మూడు భాషల్లో దేశవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. పేటీఎం – జస్ట్ టికెట్స్.. ఇలా సినిమాల టికెట్లు అమ్మే మరికొన్ని వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఇక ఆన్ లైన్ బుకింగ్సే లేని థియేటర్లుంటాయి. ఆన్ లైన్లో ఉన్న థియేటర్లకు కూడా లైవ్ బుకింగ్ ఉంటుంది. ఆ లెక్కలన్నీ కలిపితే ఇప్పటిదాకా ఎన్ని టికెట్లు అమ్ముడై ఉంటాయో అంచనా వేయలేం. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే ఈ చిత్రం పదుల కోట్లలో వసూళ్లు రాబట్టి ఉంటుందన్నది మాత్రం స్పష్టం.

Loading…