రాహుల్ గాంధీ సంచలన ప్రకటన.. అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు రుణ మాఫీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోరు పెంచారు. దేశంలోని పేదలందరికీ కనీస వేతన పథకాన్ని తీసుకొస్తామని ఇటీవల హామీ ఇచ్చిన రాహుల్.. తాజాగా దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో రుణమాఫీ అమలు చేస్తున్నామని, కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే దీనిని దేశవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ నిర్వహించిన మెగా ర్యాలీలో రాహుల్ ఈ ప్రకటన చేశారు.

కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని రైతులు కోరుకుంటున్నారని, రైతులను అవమానించిన మోదీ ప్రభుత్వానికి వారే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రుణమాఫీని రైతు సమస్యకు పరిష్కారంగా కేంద్రం భావించడం లేదన్నారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలను చూసిన తర్వాత మాత్రమే కేంద్రం నగదు బదిలీని ప్రకటించిందని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఇప్పుడు రూ.6 వేలు ఇస్తామని అంటున్నారని రాహుల్ విమర్శించారు. కాగా, ఈ ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, జేడీయూ మాజీ నేత శరద్ యాదవ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.

Loading…