రూ.25కోట్ల బడ్జెట్‌తో ‘జయలలిత’ మెగా సీరియల్!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయోపిక్‌లను తెరకెక్కించేందుకు కోలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె చరిత్ర ఆధారంగా నాలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. జయలలిత పాత్రలో నిత్యామేనన్, విద్యాబాలన్ తదితరులు నటిస్తున్నారు. సీనియర్ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించే సినిమాకు సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలోనే జయలలిత జీవితం ఆధారంగా సీరియల్ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు గౌతమ్ మేనన్. సినిమా స్థాయిలో 30 ఎపిసోడ్‌లతో జయలలిత బయోపిక్ సీరియల్ రూపొందించేందుకు గౌతమ్ మేనన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ గంట పాటు ఉంటుందని తెలుస్తోంది. సుమారు రూ.25కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సీరియల్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓ ప్రముఖ ఛానెల్, గౌతమ్ మేనన్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఈ సీరియల్‌లో జయలలితగా సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపిస్తారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మెగా సీరియల్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తున్నారంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ‘మదర్’ అనే టైటిల్‌తో ఫస్ట్‌లుక్ కూడా సోషల్‌మీడియా వైరల్ అయింది. అయితే దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు సీరియల్‌లో జయలలితగా ఆమె కనిపించడం ఖాయమైందని తెలుస్తోంది.

Loading…