సీబీఐ తీరును ఖండించిన చంద్రబాబు.. మమతకు అండగా ఉంటామన్న సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అండగా నిలిచారు. సీబీఐ తీరుపై మండిపడిన బాబు.. కేంద్రం చర్యలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థలను ధ్వంసం చేసేందుకు మోదీ-అమిత్ షా ద్వయం కంకణం కట్టుకుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. రాష్ట్రాలను భయపెట్టే చర్యలను మానుకోవాలని హితవు పలికారు.

మళ్లీ అధికారంలోకి వస్తామన్న ఆశలు సన్నగిల్లడం వల్లే బీజేపీ ఇటువంటి పనులకు దిగజారుతోందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలా అశాంతి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మమతకు తామంతా అండగా ఉంటామని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మమతకు మద్దతు ఇస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

Loading…