‘సూపర్‌స్టార్’ టీవీ పెట్టబోతున్న రజినీకాంత్?

వెండితెరపై సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్న రజినీకాంత్ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారా? అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. రజినీకాంత్ కొత్తగా టీవీ ప్రారంభిస్తున్నారన్న వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. టీవీ కోసం రజనీ మక్కల్ మండ్రం ప్రతినిధులు ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. దీనికి రజినీ టీవీ, సూపర్‌స్టార్ టీవీ, తలైవార్ టీవీ తదితర పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రజినీ ఈ ఛానల్ ద్వారా తన విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారట.

టీవీ ఏర్పాటుకు రజనీ అనుమతి ఇవ్వడంతో రజనీ మక్కల్ మండ్రం కన్వీనర్ వీఎమ్ సుధాకర్ ఇప్పటికే దరఖాస్తు చేశారట. టీవీ లోగో మధ్యలో రజినీకాంత్ ఫోటో వచ్చేలా రూపొందిస్తున్నారట. రజినీకాంత్ టీవీ ఏర్పాటు కోసం చేసిన దరఖాస్తు ఇదేనంటూ ఓ అభిమాని చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌‌గా మారింది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ గతేడాది డిసెంబర్‌లో రజినీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అభిమానులతో సమావేశం ఏర్పాటుచేసిన ఆయన ‘రజినీ మక్కల్ మండ్రం’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.

ఇటీవల 2.0తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్‌స్టార్.. రూ.500కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి తన సత్తాను మరోసారి చాటారు. త్వరలోనే ‘పేట’తో థియేటర్లలో సందడి చేయనున్నారు.

Loading…