9 వేల ఫోన్లు ట్యాపింగ్.. షాకింగ్ వివరాలివిగో

దర్యాప్తు సంస్థలకు మోదీ ప్రభుత్వం ‘ట్యాపింగ్’ అధికారాలు కట్టబెట్టడంపై విపక్షాల నుంచి విమర్శలు చెలరేగుతున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2013లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం నెలకు 7500 నుంచి 9 వేల ఫోన్లను, 300 నుంచి 500ల ఇ-మెయిళ్లను ట్యాపింగ్ చేసినట్లు బహిర్గతమైంది. ఆర్టీఐ యాక్టు కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీఐ కార్యకర్త ప్రసంజిత్ మొండల్ చేసిన దరఖాస్తుకు బదులిస్తూ.. కేంద్ర హోం శాఖ వెల్లడించిన ఈ వివరాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

ప్రసంజిత్ మొండల్ దరఖాస్తుకు కేంద్ర హోం శాఖ 2013 ఆగస్టు 6న బదులిచ్చినట్లు పత్రాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో పేర్కొన్న ప్రకారం.. యూపీయే ప్రభుత్వ హయాంలో నెలకు సరాసరి 7500 – 9000 ఫోన్ కాల్స్, 300 – 500ల ఇ-మెయిళ్లను అడ్డుకున్నట్లు స్పష్టమైంది.

ట్యాపింగ్ చేయడానికి నాటి యూపీఏ ప్రభుత్వం దేశంలోని 10 కీలక దర్యాప్తు సంస్థలకు అధికారాలు ఇచ్చినట్లు సదరు లేఖ వెల్లడిస్తోంది. వీటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), కేబినెట్ సెక్రటేరియేట్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్‌ఏడబ్ల్యూ), కమిషనర్ ఆఫ్ పోలీస్-ఢిల్లీ ఉన్నాయి.

పౌరుల ఫోన్లు, ఇ-మెయిళ్లను ట్యాపింగ్ చేయడానికి దర్యాప్తు సంస్థలకు మోదీ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ఈ చర్య అప్రజాస్వామికమని మండిపడ్డాయి. పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని ధ్వజమెత్తాయి.

Loading…