తనుశ్రీ వివాదంపై శిల్పాశెట్టి స్పందన

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం ఓ సాంగ్ షూటింగ్‌లో భాగంగా నటుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిని నానా పటేకర్ ఖండించడమే కాకుండా తనుశ్రీపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని వెల్లడించారు. అయితే తనుశ్రీ ఆరోపణలపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.

తాజాగా ఈ విషయమై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు స్పష్టంగా తెలియదు… కానీ సెట్స్‌లో ఉండగా అలాంటి హింసకు తావుండదని నా అభిప్రాయం. అక్కడ స్త్రీ, పురుషులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని నేను నమ్ముతున్నాను. కానీ తనుశ్రీ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతున్నా. అక్కడ ఆమె ఎంత ఇబ్బంది పడిందో నేను అర్థం చేసుకోగలను’ అని శిల్పాశెట్టి అన్నారు.